పీడీఎఫ్‌‌‌‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ 

పీడీఎఫ్‌‌‌‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ 

 

  • నల్గొండ-వరంగల్‌‌‌‌-ఖమ్మం బరిలో ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థి
  • అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ప్రజా సంఘాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నల్గొండ-–వరంగల్‌‌‌‌-–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్‌‌‌‌) తరఫున ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో టీఎస్‌‌‌‌ యూటీఎఫ్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన జరిగిన ప్రజా సంఘాల రౌండ్‌‌‌‌టేబుల్‌‌‌‌ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. పట్టభద్రులు డబ్బు, మద్యానికి అతీతంగా ప్రజా సమస్యలపై నిబద్ధత ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

భావసారూప్యత కలిగిన వామపక్ష, ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, విద్యార్థి ఉద్యమాల నుంచి న్యాయవాద వృత్తి వరకు ప్రజల పక్షాన పోరాడుతున్న కొల్లి సత్యనారాయణను బరిలోకి దించాయని తెలిపారు. శాసనమండలి మాజీ సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ మండలి మేధావులు, పెద్దల సభ అని, నోటు లేని ఓటుతో మంచి వ్యక్తిని గెలిపించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను ప్రజా సంఘాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సంఘాలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని పీడీఎఫ్‌‌‌‌ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ తెలిపారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

సీఐటీయూ రూ.లక్ష విరాళం.. 

కొల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం సీఐటీయూ తరఫున తొలి విడతగా రూ.లక్ష విరాళాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రకటించారు. 634 అనుబంధ సంఘాలు కలిగిన సీఐటీయూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తుందని తెలిపారు.